పులివెందుల ప్రజలను, పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు

SMTV Desk 2019-03-21 13:52:43  vivelkananda reddy,

వైసీపీనేత వివేకానందరెడ్డి హత్యపై వైసీపీ-టిడిపిల మద్య జరుగుతున్న శవరాజకీయాలపై ఆయన కుమార్తె సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య-దర్యాప్తు-శవరాజకీయాలపై మీడియాలో వస్తున్న కధనాలను ఆమె తప్పు పట్టారు.

పులివెందులలో ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నా తండ్రి హత్యకు గురైనందుకు మేము ఎంతో బాధపడుతుంటే, మరోపక్క ఆ విషాదఘటనపై రాజకీయనాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటం చాలా బాధ కలిగిస్తోంది. దీనిపై మీడియా కూడా రకరకాల కధనాలు ప్రసారం చేస్తోంది. ఇవన్నీ సిట్ దర్యాప్తును ప్రభావితం చేస్తాయని తెలియదా? ఒకరి విషాదాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం తగునా? మా నాన్నగారు మాకంటే పులివెందుల ప్రజలను, పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కనుక ఆయన బ్రతికి ఉన్నప్పుడూ అందరూ ఏవిదంగా ఆయనను గౌరవించేవారో ఆయన లేనప్పుడు కూడా అలాగే గౌరవిస్తూ మౌనంగా ఊరుకొంటే దర్యాప్తు సజావుగా సాగుతుంది. సిబిఐ చేత దర్యాప్తు చేయించాలా లేక సిట్ చేత చేయించాలా అనేది ముఖ్యం కాదు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందా లేదా?మా నాన్నగారిని హత్య చేసిన దుర్మార్గులను పట్టుకొని శిక్షించడమే మాకు ముఖ్యం. కనుక రాజకీయ నాయకులు, మీడియా అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నాను,” అని అన్నారు.

వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్న దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేదని కనుక ఈ కేసును సిబిఐకి అప్పగించవలసిందిగా కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారమే ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిలో చంద్రబాబునాయుడు, ఏపీ డిజిపి, కేంద్రప్రభుత్వం, సిబిఐ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కానీ నిన్ననే వివేకానందరెడ్డి కుమార్తె సునీత ‘సిట్ దర్యాప్తు చేసినా తనకు అభ్యంతరం లేదని’ చెప్పడం విశేషం. అంటే జగన్ తీరును కూడా ఆమె తప్పు పడుతున్నారని స్పష్టం అవుతోంది. సున్నితమైన ఒక కేసుపై సిట్ దర్యాప్తు జరుపుతుండగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబునాయుడుతో సహా టిడిపి నేతలు కూడా తమ వాదనలు వినిపిస్తుండటం వలన సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.