గాజువాక నుంచి పోటీ చేయడం ఒక బాధ్యత

SMTV Desk 2019-03-21 13:50:35  Pawan Klayan, Janasena,

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగే స్థానాలపై పార్టీ కార్యవర్గ సమావేశంలో పెద్ద కసరత్తే జరిగింది. వాస్తవానికి పవన్‌ ఇచ్ఛాపురం, అనంతపురం నుంచి పోటీ చేయాలని అభిలాషించారు. అయితే ఆయా స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నా.. శ్రేణుల సన్నద్ధతకు సమయం సరిపోదని కార్యవర్గం అభిప్రాయపడింది. ఇదే సమయంలో అనేక ప్రతిపాదనలపైనా చర్చ జరిగింది. తిరుపతి స్థానం చర్చకు రాగా.. ప్రజారాజ్యం తరుఫున చిరంజీవి పోటీ చేసి గెలుపొందారని మళ్లీ తాను నిలిస్తే అది మెగా కుటుంబ స్థానంగా ముద్రపడుతుందేమోనని పవన్‌ అన్నారు. పార్టీ పరంగా బలంగా ఉన్న పెందుర్తి టికెట్‌ను విశాఖ జిల్లా వాసికి ఇవ్వాలన్న పవన్‌.. రాజమండ్రి లోక్‌సభ పరిధిలోని రాజానగరం సీటు స్థానికంగా పార్టీ కోసం పనిచేసిన వారికే ఇద్దామని కార్యవర్గానికి సూచించారు.

ఇక పిఠాపురంలో జనసేన బలంగా ఉందని కార్యవర్గం నివేదించినా అక్కడి నుంచి ఆడపడుచును అసెంబ్లీకి పంపిద్దామని పవన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిపాదనకు వచ్చిన గాజువాక, భీమవరం స్థానాల నుంచి బరిలోకి దిగడం ఉత్తమమని జనసేనాని భావించారు. సాధారణంగా ఉత్తరాంధ్ర నుంచి సీఎం అభ్యర్థులు ఎవరూ బరిలో ఉండరని.. ఆ ప్రాంతం నుంచి అసెంబ్లీకి వెళ్లడం ఒక చారిత్రక అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భీమవరంలో పోటీ చేస్తే అన్ని ప్రాంతాల్లో పార్టీకి సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తుందని జనసేన కార్యవర్గం విశ్లేషించింది. తాను నటనలో ఓనమాలు నేర్చుకున్న విశాఖ ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీకి దిగడంపై పవన్‌ సంతోషం వ్యక్తంచేశారు. గాజువాక ప్రాంతం స్టీల్‌ప్లాంట్‌, ఇతర పరిశ్రమలతో అభివృద్ధి చెందిందని చెబుతున్నా భూములు ఇచ్చిన రైతులకు నేటికి పరిహారం దక్కని విషయం తాను పోరాట యాత్రలో గ్రహించానని పవన్‌ చెప్పారు. తద్వారా గాజువాక నుంచి పోటీ చేయడం ఒక బాధ్యతగా పేర్కొన్నారు.

ఇక భీమవరంతో తనకున్న అనుబంధాన్ని సైతం పవన్‌ జనసేన కార్యవర్గ సభ్యులతో పంచుకున్నారు. డీఎన్‌ఆర్‌ కళాశాలలో పరీక్షలు రాసేందుకు వెళ్లి అక్కడ పాఠ్య పుస్తకాలు వదిలేసినట్లు పవన్‌ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది ఆ క్షణం నుంచేనని చెప్పారు. భీమవరం అభివృద్ధి చెందిన ప్రాంతంగా కన్పించినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయనే విషయంపై తనకు అవగాహన ఉందని పవన్‌ అన్నారు. అక్కడి నాయకులు అభివృద్ది చెందారే గానీ ప్రజలను పట్టించుకోలేదని.. భీమవరం డంపింగ్‌యార్డ్‌ సమస్య ప్రజాప్రతినిధుల చెవికెక్కలేదని ఆక్షేపించారు. యనమదుర్రు డ్రైయిన్‌ ఒక మురికి కూపంలా మారినా పట్టించుకోలేదని.. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనను భీమవరం నుంచే మొదలుపెట్టనున్నట్లు పవన్‌ వెల్లడించారు.