గోద్రా స్టేషన్‌లో రైలు దహన కేసు : నిందితుడికి జీవిత ఖైదు

SMTV Desk 2019-03-21 13:24:31  godra railwaystation, fire accident

గాంధీనగర్, మార్చ్ 20: గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో 2002లో చోటుచేసుకున్న రైలు దహన కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక సిట్ కోర్టు యాకుబ్ పటాలియాకు జీవిత ఖైదు విధించింది. ఈ దుర్ఘటన జరిగిన 16 ఏళ్ళ తరువాత 2018 జనవరిలో గుజరాత్ పోలీసులు యాకుబ్‌ని గోద్రాలో అరెస్ట్ చేశారు. కాగా బుధవారం రోజున యాకుబ్‌కు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక సిట్ కోర్టు తీర్పు వెలువరించింది. యాకూబ్‌కి వ్యతిరేకంగా 2002 సెప్టెంబర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతనిపై ఐపీసీ, రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. యాకూబ్ సోదరుడు కాదిర్ పటాదియాని కూడా పోలీసులు 2015లో అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతుండగానే కాదిర్ 2015లో జైల్లో మరణించాడు. యాకూబ్ మరో సోదరుడు అయూబ్ పటాలియా వడోదరా సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. 27 ఫిబ్రవరి 2002 లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 బోగీకి గోద్రా స్టేషన్ దగ్గర దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో దాదాపు 59 మంది సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైనది. వీరిలో ఎక్కువ మంది అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి 31 మార్చి 2002 వరకు గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయి. వీటిలో దాదాపు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 1500 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.