నా జీవితంలో తుపాకీని చూడలేదు : విక్రమ్ గౌడ్

SMTV Desk 2017-08-10 11:41:29  hyderaabaad, mukesh goud, gun, bullet, intragation.

హైదరాబాద్, ఆగస్ట్ 10 : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, విక్రమ్ గౌడ్ ను ఒక రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయన నుండి ఎటువంటి సమాధానం రాబట్టలేకపోయినట్టు తెలుస్తుంది. పోలీసులు అడిగిన ఒక్కో ప్రశ్నకు విక్రమ్ దిమ్మ తిరిగిపోయే సమాధానాలు ఇచ్చినట్లుగా సమాచారం. వివరాలలోకి వెళితే.. ఇటీవల తన తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు తనను తానూ సుపారీ ఇచ్చి కాల్పించుకున్న విక్రమ్ గౌడ్ ను విచారించడానికి, సుప్రీంకోర్టు ఒకరోజు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు తిక్క తిక్క సమాధానాలు చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అసలు తుపాకీ ఎక్కడ కొన్నారు? కొనుగోలు చేసిన 20 బుల్లెట్లలో మూడింటిని వాడగా, మిగతావి ఎక్కడ? వంటి ప్రశ్నలకు.. బుల్లెట్లా? అవెలా ఉంటాయి? నేను నా జీవితంలో తుపాకీని చూడలేదంటూ పోలీసుల సహనాన్ని పరీక్షి౦చినట్లుగా తెలుస్తుంది. విక్రమ్ గౌడ్ మిగతా బుల్లెట్లను ఎక్కడ దాచారన్న విషయాన్ని తేల్చేందుకు మరోసారి ఆయన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించగా అక్కడ ఏ ఆధారం లభించలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోగా ప్రశ్నించి తిరిగి విక్రమ్ ను జైలుకు పంపాల్సి ఉండగా అసలు తనను విచారించేందుకు తగిన సమయం లభి౦చకపోవడంతో పోలీసులు అతనిని మరోసారి కస్టడీకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.