బిగ్‌ బాస్‌3 కి హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్!

SMTV Desk 2019-03-20 12:41:09  bigboss season 3, king nagarjuna, ntr, nani, maa

హైదరాబాద్‌, మార్చ్ 19: తెలుగు బిగ్‌ బాస్‌ రియాలిటీ షో అభిమానుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సీజన్‌ని ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయగా, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక మూడవ సీజన్‌కు ఎవరు హోస్ట్‌ అనే విషయంపై కొన్నాళ్ళుగా హాట్‌ హాట్‌ చర్చలు జరుగుతున్నాయి. కాగా తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ అన్నీ తానై న‌డిపించి మంచి స‌క్సెస్ చేయ‌డంతో మూడో సీజ‌న్‌కి కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావించారట‌. కాని ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌తో క్ష‌ణం తీరిక లేని స‌మ‌యం గడుపుతున్నాడు. మ‌రి ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్‌3ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డం అసాధ్యం. బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్ రేస్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవ‌డంతో ఆయన స్థానంలో ఎవ‌రిని తీసుకోవాలా అని నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. నానినే కొన‌సాగిద్దామంటే రెండో సీజ‌న్‌కి వ‌చ్చిన నెగెటివ్ ఇంపాక్ట్ మూడో సీజ‌న్‌పైన ప‌డుతుందేమోన‌ని మా యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌. ఇక మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే వారికి ఉన్న ఏకైక ఆప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ అనుభవాన్ని బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలోను ఉప‌యోగించి షోని మంచి హిట్ చేస్తార‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నార‌ట‌.