టీడీపీ లో మరో వికెట్ ఢమాల్

SMTV Desk 2019-03-20 12:30:21  TDP, Dhamal, TDP

హైదరాబాద్, మార్చ్ 19: తెలంగాణలో టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనను సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామాను బరిలోకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు చేర్చినట్టు తెలుస్తోంది.

సోమవారం కేసీఆర్‌తో భేటీ అయిన నామా… సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. అన్ని అంశాలపై చర్చించన తర్వాతే నామా పేరును ఖమ్మం అభ్యర్థిగా కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలకూ కూడా తెలిపినట్లు సమాచారం. అయితే, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత కారెక్కిన సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ప్రచారం. ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా నామా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఖమ్మం స్తానన్ని ఖాళీగా వదిలేసింది. ఒకవేళ నామా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనను ఖమ్మం నుంచి బరిలో దింపాలని యోచించింది. కానీ తాజాగా నామా కారెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది.