పరువు కాపాడుకున్న అంబానీ బ్రదర్స్

SMTV Desk 2019-03-19 15:41:31  mukhesh ambani, anil ambani, reliance jio, reliance infrastructure, rcom, erickson

ముంబై, మార్చ్ 19: రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్) అధినేత అనిల్ అంబానీ ఎరిక్సన్ కంపెనీకి రూ. 550 కోట్ల బకాయిలను చెల్లించి, జైలు కెళ్లకుండా పరువు కాపాడుకోగలిగారు. ఆర్‌కామ్ నుంచి బకాయి నిధులు అందాయని ఎరిక్సన్ తరఫు న్యాయవాది దృవీకరించారు. మార్చి 19 లోగా ఎరిక్‌సన్ కంపెనీకి చెల్లింపులు జరపకపోతే జైల్లో కూర్చోవాల్సి వస్తుందని ఇటీవల సుప్రీం కోర్టు అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులకు తేల్చి చెప్పింది. దీంతో మొత్తానికి అనిల్ అంబానీ నిధులను సేకరించి ఎరిక్ సన్‌కు చెల్లింపులు చేశారు. అయితే సోదరుడు ముఖేష్ అంబానీ ఆఖరి సమయంలో తమ్ముడు అనిల్ అంబానీకి సాయం చేయడంతో ఇది సాధ్యం అయింది. ఈ చెల్లింపులు చేసిన తర్వాత రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు తన టెలికామ్ ఆస్తులను విక్రయించాలనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని ఆర్‌కామ్ ప్రకటించింది. సోదరుడు ముఖేష్ సంస్థ జియోకు ఆర్‌కామ్ ఆస్తులను విక్రయించడం ద్వారా నిధులను సమీకరించి తద్వారా అప్పులను తీర్చాలని అనిల్ అంబానీ భావించారు. అయితే ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతి లభించకపోవడం, ఆర్‌కామ్‌కు చెందిన రుణదాతల నుంచి అభ్యంతరాల వల్ల ఆర్‌కామ్‌జియో డీల్‌కు ముగింపు పడిందని, దీంతో రుణ భారాన్ని తగ్గించుకునేందుకు దివాలా కోర్టును ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చామని అనిల్ అంబానీ సంస్థ పేర్కొంది.