ఉత్త‌మ్‌ను ఓడిస్తా: స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌

SMTV Desk 2019-03-19 14:05:54  utham kumar,

ఒకపక్క వరుస ఫిరాయింపులతో సతమతమవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కీలకమైన లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీలో అసమ్మతి బెడద కూడా పెరిగిపోయింది. ఆ ట్రబుల్ మేకర్ మరెవరో కాదు మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఆయన లోక్‌సభకు పోటీ చేసి తన అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకోవాలని ఆశించడం సహజమే. కానీ ఆయన పోటీ చేయాలనుకొంటున్న సికిందరాబాద్‌ నియోజకవర్గం నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం కలగడం సహజమే.

సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఒకపక్క పార్టీలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోతుంటే పార్టీని కాపాడుకోవలసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభ టికెట్ కోసం డిల్లీలో అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒకవేళ ఆయన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసినట్లయితే, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తే కానీ రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టం. పార్టీ ప్రక్షాళన (పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలగింపు?) జరిగితే కానీ గాంధీభవన్‌లో నేను అడుగుపెట్టను,” అని అన్నారు.