రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న పవన్.

SMTV Desk 2019-03-19 13:53:05  Pawan kalyan,

అమరావతి, మార్చ్ 19: ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగనుంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలకు ధీటుగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రేస్‌లో నిలుస్తోంది. జనసేన పార్టీ ఏపీలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో కూడా కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ నియాజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

దీని పై ట్విట్టర్‌లో స్పందించిన ఆయన తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని ఓ గంటలో ప్రకటిస్తానని తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి నేను పోటీ చేస్తానన్న విషయమై జనరల్ బాడీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బహుశా ఓ గంటలో నాకు చెబుతారని అనుకుంటున్నానని అన్నారు. కాగా, ఆయన విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈరోజు వెల్లడించే జనసేన మరో జాబితాలో పవన్ కల్యాణ్‌తో పాటు, ఇటీవల పార్టీలో చేరిన మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణల నియోజకవర్గాలపై స్పష్టత రావచ్చు.