వివేకా మర్డర్ కేస్ .. ఆ ఇద్దరినీ ఉచ్చు బిగుస్తున్న సిట్ అధికారులు

SMTV Desk 2019-03-19 13:50:19  Vivekananda reddy,

పులివెందుల, మార్చ్ 19: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు సిట్ అధికారులు. ఈ కేసులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపుగా వంద మందిని విచారించ‌న‌ట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ‌గా అనుమానాలు మాత్రం వివేకానంద‌రెడ్డి ప్ర‌ధాన సన్నిహితులు గంగిరెడ్డి, ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డిల పైనే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రిని అదులోకి తీసుకున్న పోలీసులు వీరి నుండి కీల‌క స‌మాచారం రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఇద్ద‌రినీ వేరువేరు ప్రాంతాల‌కు త‌ర‌లించి విచారిస్తున్నారు పోలీసులు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. గ‌తంలో వివేకానంద‌రెడ్డికి, గంగిరెడ్డికి మ‌ధ్య ఓ భూ వివాదం విష‌యంలో గొడ‌వ జ‌రిగింది. ఆ వివాదం ఇప్ప‌టికీ న‌డుస్తున్న నేప‌ధ్యంలో వివేకా హ‌త్య‌కు దారి తీసి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. కొన్ని కోట్ల‌కు సంబంధించిన ఈ భూమిలో.. వివేకాకు తెలియ‌కుండా కొంత భూమిని గంగిరెడ్డి అమ్మి సొమ్ము చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత ఈ విష‌యం వివేకాకు తెలిడంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ స్టార్ట్ అయ్యింద‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో వివేకానందరెడ్డికి వ్య‌తిరేకంగా గంగిరెడ్డి, ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డిలు చేతులు క‌లిపి ఈ హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటారా అన్న అనుమానాలు త‌లెత్తుతున్న నేప‌ధ్యంలో ఆ కోణంలో విచార‌ణ సాగిస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. పులివెందుల‌లో సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నానంటూ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి గ‌త కొంత కాలంగా అక్క‌డి స్థానికుల‌తో చెప్పిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని, కొంత కాలం నుండి వారితో ట‌చ్‌లోనే ఉన్నాడ‌ని పోలీసులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. వివేకా హ‌త్య‌కు ముందు ప‌ర‌మేశ్వ‌ర రెడ్డి కాల్ డేటా ప‌రిశీలించ‌గా.. అత‌ను వివేకానంద‌రెడ్డితోనూ, టీడీపీ నేత‌ల‌తోనూ మాట్లాడిన‌ట్లు ఫోన్ కాల్ డేటాలో పోలీసులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సిట్ అధికారులు త్వ‌ర‌లోనే ఈ కేసుకు సంబంధించి మిస్ట‌రీని చేధించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.