రాజ‌కీయాల్ని వ‌దిలేస్తానంటూ జ‌గ్గారెడ్డి సంచలనం

SMTV Desk 2019-03-19 13:46:23  Jagga reddy, Politics, TRS

తెరాస‌లో చేరాల్సి వ‌స్తే రాజ‌కీయాల్ని వ‌దిలేస్తానంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. గ‌త రెండు మూడు రోజులుగా జ‌గ్గారెడ్డి తెరాస‌లో చేర‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని జ‌గ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడుతున్నాన‌ని, తెరాస‌లో చేర‌బోతున్నాన‌ని ప్ర‌చారం జ‌ర‌గుతోంది. అదే ప‌రిస్థితి వ‌స్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటానే కానీ తెరాస‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో చేర‌బోన‌ని జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

త‌న‌ని పార్టీ మారాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెరాస నేత సంప్ర‌దించ‌లేద‌ని, త‌మ పార్టీలో చేర‌డం లేద‌ని తెరాస న‌న్ను జైలుకు పంపించినా పోరాడ‌టానికి సిద్ధంగా వున్నాన‌ని, గ‌తంలో తాను పార్టీ మార‌డం వ‌ల్ల త‌న ఇమేజ్ దెబ్బ‌తింద‌ని కూతురు విజ‌యారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆలోచింప‌జేశాయ‌ని, ఆమె మాట‌ను గౌర‌విస్తాన‌ని, కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేయడం రాజ‌కీయ ప్రాధాన్య‌తం సంత‌రించుకుంది. గ‌త కొన్ని రోజులుగా జ‌గ్గారెడ్డి తెరాస‌లో చేరుతున్నారంటూ ఊహాగానాలు మొద‌లుకావ‌డం, అదే స‌మ‌యంలో జ‌గ్గారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ల‌డంతో త‌ను తెరాస‌లో చేర‌డం ఖాయ‌మే అంటూ టీపీసీసీ భ‌యాందోళ‌న‌కు గురైంది. అయితే జ‌గ్గారెడ్డి తాజా వ్యాఖ్య‌ల‌తో తెలంగాణ పీసీసీ ఊపిరి పీల్చుకున్న‌ట్లు తెలుస్తోంది.