ఆఫ్గనిస్థాన్ సంచలన రికార్డు

SMTV Desk 2019-03-18 17:45:40  Afghanistan,

డెహ్రాడూన్, మార్చ్ 18: క్రికెట్ పసికూన ఆఫ్గనిస్థాన్ తాజాగా టెస్టు క్రికెట్ లో సంచలనం నమోదు చేసింది. తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకొని ఆడిన రెండో టెస్టులోనే గెలుపొందిన జ‌ట్టుగా చరిత్రకెక్కింది. ఆఫ్గాన్ కంటే ముందు ఆడిన రెండో టెస్టులో విక్టరీ సాధించిన జట్లుగా పాక్, ఇంగ్లండ్ ఉన్నాయి. ఆసీస్ మాత్రం ఆడిన తొలి టెస్టులోనే విజయాన్ని అందుకుంది. ఇక భారత్ తన తొలి టెస్టు విజయాన్ని అందుకోవడానికి 25 మ్యాచులు ఆడింది. ఆఫ్గాన్ గతేడాది భారత్‌పై తన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్గాన్ సమిష్టి ప్రదర్శనతో తొలి విజయాన్ని నమోదు చేసింది. 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్థాన్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాస విజయాన్ని అందుకుంది. ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్లు రహ్మత్‌షా(76), ఇషానుల్హా (65 నాటౌట్) అర్ధశతకాలతో చెలరేగడంతో ఆఫ్గనిస్థాన్ అలవోకగా గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులతో రాణించి ఒంటిచేత్తో జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. దీంతో రహ్మత్‌షా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’,’మ్యాన్ ఆఫ్ ది సిరీస్’లు దక్కించుకున్నాడు.