కోహ్లిని మించిన బ్యాట్స్‌మన్ మరొకడు లేడు

SMTV Desk 2019-03-18 12:08:56  Virat Kohli, AB devilers,

బెంగళూరు, మార్చ్ 18:: రానున్న ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో అన్ని జట్లకు ప్రమాదం పొంచి ఉందని దక్షిణాఫ్రికా క్రికె ట్ దిగ్గజం ఎబి.డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌లో కోహ్లి మెరుపులు మెరిపించడం ఖాయమని జోస్యం చెప్పాడు. సమకాలిన క్రికెట్‌లో కోహ్లిని మించిన బ్యాట్స్‌మన్ మరొకడు లేడన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ అతను నిలకడగా రాణిస్తున్నాడన్నాడు. ప్రపంచకప్‌లో కూడా కోహ్లి ప్రకంపనలు సృష్టించడం తథ్యమన్నాడు. ఇదే జరిగితే ప్రత్యర్థి జట్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చన్నాడు. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కోహ్లికి ఉందన్నాడు. కాగా, రోహిత్ శర్మ, ధావన్ తదితరులను కూడా తక్కువ అంచన వేయలేమన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుందన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారిందన్నాడు. వచ్చే వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు కప్పు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నాడు. కొంతకాలంగా టీమిండియా నిలకడైన విజయాలు సాధిస్తుందని, ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేన్నాడు.

కాగా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లకు ట్రోఫీ గెలుచుకునే సత్తా ఉందన్నాడు. ఇటీవల కాలంలో ఇంగ్లండ్ బలమైన శక్తిగా ఎదిగిందన్నాడు. ఏ ఫార్మాట్‌లోనైనా నిలకడైన విజయాలు సాధిస్తున్న ఏకైక జట్టు ఇంగ్లండే అనడంలో సందేహం లేదన్నాడు. ఇక, భారత్‌పై సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచన వేయలేమన్నాడు. ఇప్పటికే ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన కంగారూలు మరోసారి కప్పు గెలిచినా ఆశ్చర్యం లేదన్నాడు. పాకిస్థాన్ కూడా మెరుగ్గా కనిపిస్తుందన్నాడు. అంతేగాక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు కూడా బలోపేతంగా కనిపిస్తున్నాయని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. దీంతో ప్రపంచకప్ హోరాహోరీగా సాగడం తథ్యమన్నాడు. ఇదిలావుండగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ 360 ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మిత్రుడు కోహ్లి సారథ్యంలో డివిలియర్స్ బరిలోకి దిగుతున్నాడు. కాగా, విధ్వంసక ఇన్నింగ్స్‌తో డివిలియర్స్ ఐపిఎల్‌పై తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. దీని కోసం ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాడు.