భారత్ దాడి తర్వాత...పాక్ అణుస్థావరంలో పేలిన క్షిపణి?

SMTV Desk 2019-03-18 09:30:50  pakistan, india attacked, pok

న్యూఢిల్లీ, మార్చి 18: పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత పాక్ అణ్వాయుధాలు తరలించేందుకు ప్రయత్నించిందా? ఈ క్రమంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ప్రమాదానికి గురైందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫిబ్రవరి 26 దాడుల తర్వాత పాక్ అణుస్థావరాల్లో ఏదైనా కదలిక వచ్చిందా? అన్న సందేహంతో ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేసిన నిపుణులు ఈ విషయాన్ని గుర్తించారు.

ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తున్న నిపుణులకు బలూచిస్థాన్ ప్రాంతంలోని ఖుస్ద్ అణ్వాయుధ కేంద్రంలోని కొన్ని ఫొటోలు ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఈ స్థావరంలో 46 అణువార్‌ హెడ్లను భద్రపరిచినట్టు అంచనా వేస్తున్నారు. నిజానికి ఇందులో 200 అణువార్ హెడ్లు, క్షిపణులను భద్రపరిచే సామర్థ్యంతో నిర్మించారు.

ఈ నెల 8న ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన నిపుణులకు 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పున అగ్నిప్రమాదం జరిగినట్టు అక్కడి పరిస్థితులను బట్టి గుర్తించారు. ఆ మేరకు భూమిపై పెద్ద మచ్చ కనిపిస్తోంది. కచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని నిపుణులు చెప్పలేకపోతున్నప్పటికీ క్షిపణి పేలడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.