సిట్ విచారణపై పలు అనుమానాలు: రేవంత్ రెడ్డి

SMTV Desk 2017-08-08 19:39:56  Revanth Reddy, TTDP working president, Drugs Case, SIT about drugs

హైదరాబాద్, ఆగష్ట్ 8: డ్రగ్స్ వ్యవహారంలో సిట్ రోజుకో కొత్త కోణాన్ని వెలికి తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ వేసారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించాలని ఆయన ఈ పిల్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిల్ ను హైకోర్ట్ స్వీకరించింది. ప్రస్తుతం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు అంతర్జాతీయ స్థాయి వ్యక్తులతో కూడిన వ్యవహారం, సిట్ అధికారులకు ఆ స్థాయి అధికారాలు ఉండవు కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలచే దర్యాప్తు చేయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇదే విషయంపై ఆయన ఇదివరకే రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖలు పంపించామని తెలిపారు. విచారణ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నందు వలన కొన్ని అనుమానాలు అపోహలు అందరికి ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. సిట్ దర్యాప్తు చేస్తుంది కానీ, కొన్ని విషయాలలో వారి స్థాయి ఈ కేసులో పరిమితం. అదే సిట్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరీ కలిస్తే అసలైన నేరగాళ్లకు శిక్షపడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉంది కాబట్టి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సమక్షంలో దర్యాప్తు జరపాలని పిల్ వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మీ టార్గెట్ ఎవరని ప్రశ్నించగా దీనిపై ఆయన స్పందిస్తూ వ్యక్తిగతంగా ఎవరూ మా లక్ష్యం కాదు నేరస్తులే మా టార్గెట్ అంటూ కేంద్రంతో కలిసి పని చేయడానికి రాష్ట్రానికి అభ్యంతరం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. నేరగాళ్లకి శిక్ష పడాలన్నదే తమ పార్టీ అంతిమ లక్ష్యం అని స్పష్టం చేశారు. నేషనల్ ఏజెన్సీస్ రంగంలోకి వస్తే అసలైన నేరగాళ్లు దొరకుతారన్నారు.