టీంఇండియాకు అతి ప్రయోగాలు ఎక్కువయ్యాయి!

SMTV Desk 2019-03-15 17:19:37  team india, india, virat kohli, sunil gawaskar, saourav ganguly

న్యూఢిల్లీ, మార్చ్ 15: ఆసిస్ తో వన్డే సిరీస్ ను టీంఇండియా కోల్పోవడంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరీస్‌ చేజారడానికి భారత్ అతి ప్రయోగాలే కారణమని కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి పరోక్షంగా చురకలు అంటించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లోనూ గెలిచిన భారత్ జట్టు.. మూడో వన్డే నుంచే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేపట్టి హ్యాట్రిక్ ఓటముల్ని చవిచూసింది. వన్డే ప్రపంచకప్ ముంగిట సిరీస్ ఓటమి భారత్‌కి మంచిదికాదని నిన్న వెల్లడించిన సునీల్ గవాస్కర్.. సిరీస్ గెలిచిన తర్వాత టీమ్‌లో ప్రయోగాలు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా గవాస్కర్‌ వాదనతో అంగీకరించిన గంగూలీ.. ప్రపంచకప్‌ ముంగిట టీమిండియాకి ఈ ఓటమి ఒక మేలుకొల్పని చెప్పుకొచ్చాడు. ‘వన్డే సిరీస్‌లో భారత్‌ కంటే ఆస్ట్రేలియా జట్టు మెరుగ్గా ఆడింది. ఇందులో సందేహం లేదు. ఈ ఆస్ట్రేలియా జట్టే ప్రపంచకప్‌లోనూ గట్టి ప్రత్యర్థిగా నిలవనుంది. కాబట్టి.. ప్రపంచకప్‌ ముందు భారత్‌కి ఒకరకంగా ఈ సిరీస్‌ ఓటమి ఓ మేలుకొల్పు. సిరీస్‌లో టీమిండియా మరీ ఎక్కువగా ప్రయోగాలు చేసింది. అయినప్పటికీ.. ప్రపంచకప్‌కి ఇంకా చాలా సమయం ఉంది’ అని గంగూలీ వెల్లడించాడు.