నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన 16 ఏళ్ల చిన్నారి

SMTV Desk 2019-03-15 17:10:24  Greta Thunberg, Climate striker Greta Thunberg nominated for Nobel peace prize

స్వీడన్‌, మార్చ్ 15: స్వీడన్‌కు చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక ప్రపంచ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయి చరిత్ర సృష్టించింది. ప్రపంచ వాతావరణ మార్పులపై తన ప్రసంగాలతో అందరి చూపు తనవైపు తిప్పుకున్న 16 ఏళ్ల చిన్నారి గ్రెటా థంబెర్గ్‌ ను ఈ సారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్‌ చేశారు. దీనిపై గ్రెటా థంబెర్గ్‌ స్పందిస్తూ..’నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది. గత నెల పర్యావరణ మార్పులపై చర్య తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి గ్రెటా ఓ వీడియో సందేశాన్ని కూడా పంపింది. ఆ సందేశంలో క్లైమేట్ చేంజ్‌పై కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా కార్యాచరణ మొదలుపెట్టాలని మోదీకి సూచించింది. గ్రెటా థంబెర్గ్‌ ప్రస్థానం… 2018 టైమ్స్‌ అత్యంత ప్రభావిత చిన్నారుల లిస్ట్‌లో గ్రెటాకు చోటుదక్కింది. క్లైమేట్ చేంజ్‌పై ప్రపంచ నాయకులు స్పందించాలంటూ 2018 ఆగస్టులో స్వీడన్ పార్లమెంటు ముందు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టింది. క్లైమేట్ చేంజ్‌పై నాయకులు చర్యలు తీసుకునేలా విద్యార్థులంతా పోరాడాలని పిలుపునిచ్చింది. అలాగే గత డిసెంబరులో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పులపై అద్భుతమైన ప్రసంగంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికపై తన ప్రసంగాన్ని వినిపించింది. అనంతరం క్లైమేట్ చేంజ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మోదీతో సహా దేశాధినేతలకు ఓ వీడియో సందేశం పంపింది. ఒకవేళ గ్రెటా థంబెర్గ్‌ని నోబెల్‌ శాంతి బహుమతి వరించినట్లయితే ఇప్పటి వరకూ ఈ బహుమతి అందుకున్న వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించనుంది. పాకిస్థాన్‌కు చెందిన మాలాలా యూసఫ్‌ జాయ్‌ 17ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న విషయం తెలిసిందే.