ముంబైలో కుప్పకూలిన బ్రిడ్జి

SMTV Desk 2019-03-15 11:48:28  Mumbai,

ముంబై , మార్చ్ 15: ముంబైలో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కసబ్ బ్రిడ్జ్గ గా పిలిచే ఈ బ్రిడ్జ్.. ముంబైలోని సీఎస్‌టీ నుంచి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనం వైపు వెళ్లే రహదారిపై ఉంది. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్‌ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. గురువారం తమ తమ ఉద్యోగుల విధులను ముగించుకొని ఇళ్లకు వెళ్తుతున్న సమయంలో..సరిగ్గా 7.30 నిమిషాలకు వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న చాలామంది పాదాచారులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఊహించని ఘటనతో విస్తుపోయిన పాదాచారులు తేరుకొనే సరికి తీవ్రగాయాలతో కొందరు..మరికొందరు ప్రాణాలు కోల్పోయి విగతజీవులైనారు. ఘటనా స్థలికి చేరకున్న విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ముంబైలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి కానీ.. అధికారగణం మాత్రం తగిన చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. 2017, సెప్టెంబర్‌ 29న ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వే బ్రిడ్జిపై తొక్కిసలాట జరుగడంతో 23 మంది చనిపోయారు. అలాగే 2018, జూలై 3న అంధేరీ ప్రాంతంలోని 40 ఏళ్ల పాతదైన గోఖలే బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.