వేగం పెంచిన కాంగ్రెస్

SMTV Desk 2019-03-15 11:46:36  Congress, Raghuveera reddy,

విజయవాడ, మార్చ్ 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. విభజన తర్వాత మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఇక, ఈ ఎన్నికలకు ముందూ తర్వాత చాలా మంది నేతలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లోకి జంప్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అతి దారుణంగా తయారయింది. ఇలాంటి సమయంలో కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీ సన్నద్ధం అవుతోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ స్పీడు పెంచేసింది.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు కూడా స్వీకరించింది. అభ్యర్థుల ఎంపికపై ఇన్ని రోజులు కసరత్తు చేసిన పీసీసీ.. నేడు (శుక్రవారం) జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సుమారు 1300 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.