ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఛాయలు

SMTV Desk 2019-03-15 09:50:49  vivekanada,

హైదరాబాద్, మార్చ్ 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి చిన్న తమ్ముడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఈ తెల్లవారు జామున గుండెపోటుతో కనుమూసారు, ఆయన హఠాన్మరణం తో అయన స్వస్థలం పులివెందులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి, స్వతహాగా సౌమ్యుడు. తన అన్న వైఎస్సార్ కు కుడి భుజంగా ఉంటూ అజాత శత్రువుగా పేరు పొందారు, సాయం అడిగిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లేవారని అంటూ ఉంటారు.

వివేకా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖా మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేశారు. ఈయన 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు, తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ పొందారు. 1989,1994లలో పులివెందుల నుంచి వివేకా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999లో ఎంపీగా 90,000వేల మెజారిటీతో గెలుపొందారు, ఇది అప్పటికి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ. తర్వాత మళ్లీ 2004లో 1,10,000వేల అత్యధిక మెజారిటీ సాధించారు, 2009లో ఎమ్మెల్సీగా రాష్ట్రానికి తన సేవలందించారు.చాలా సౌమ్యుడిగా పేరున్న వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానులను శోక సంద్రంలో పడేసింది.