డీజీపీ అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు

SMTV Desk 2019-03-14 18:17:35  DGP,

హైదరాబాద్, మార్చ్ 14: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ (డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్‌)పై ఎన్నిక‌ల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు అందింది. మంగ‌ళ‌గిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నిక‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కు డీజీపీ ఠాకూర్‌ను త‌ప్పించాల‌ని రామ‌కృష్ణారెడ్డి తాను చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై కోడిక‌త్తితో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం విష‌యంలో డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈసీకి అంద‌జేసిన ఫిర్యాదులో ఎమ్మెల్యే ఆళ్ల పేర్కొన్నారు.

ఈసీకి డీజీపీపై ఫిర్యాదు చేసిన అనంత‌రం ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డీజీపీ అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ఠాకూర్ డీజీపీగా ఉంటే ప్ర‌జ‌లు వారి వారి ఓటు హ‌క్కును స‌జావుగా వినియోగించుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. ఠాకూర్‌పై హైకోర్టులో పిటిష‌న్ పెండింగ్‌లో ఉండ‌గా ఆయ‌న్ను డీజీపీగా నియ‌మించార‌ని, ఆఖ‌ర‌కు జీహెచ్ఎంసీ స్థ‌లాన్ని ఆక్ర‌మించుకుని ఇళ్లు నిర్మించుకున్న వ్య‌క్తి డీజీపీ ఠాకూర్ అని విమ‌ర్శించారు. అటువంటి వ్య‌క్తి ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో విధులు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని, ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ఆయ‌న్ను విధుల‌కు దూరంగా ఉండేలా చూడాల‌ని ఈసీకి చేసిన ఫిర్యాదులో ఎమ్మెల్యే ఆళ్ల పేర్కొన్నారు.