ఢిల్లీ క్యాపిటల్స్‌ కు సలహాదారుడిగా గంగూలీ

SMTV Desk 2019-03-14 18:11:04  

న్యూఢిల్లీ, మార్చ్ 14: 2019 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సలహాదారుడిగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ... ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో పనిచేయనున్నందుకు సంతోషంగా ఉంది. జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ సంస్థల గురించి చాలా ఏళ్లుగా తెలుసు. వారి క్రీడా ప్రస్థానంలో కూడా భాగమైనందుకు ఆనందంగా ఉందిగ అని అన్నాడు. అలాగే దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఛైర్మన్‌ పార్థ్‌ జిందాల్ స్పందిస్తూ గంగూలీ అనుభవం, సలహాలు, సూచనలు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన నాకు కుటుంబ సభ్యుడితో సమానం. గంగూలీ తమ జట్టుకు సలహాదారుగా ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పనిచేయనున్నారు. ఢిల్లీ జట్టు ఇంతవరకు ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లోనూ ట్రోఫీని చేజక్కించుకోలేదు. మార్చి 24న ముంబై ఇండియన్స్‌తో, ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.