తెరాస జాబితా విడుదలకు సర్వం సిద్ధం

SMTV Desk 2019-03-14 12:19:15  TRS, TRS list,

హైదరాబాద్,, మార్చ్ 14: కాంగ్రెస్‌, బిజెపిలు ఒకటి రెండు రోజులలో తమతమ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేయనున్నాయి. ముందుగా తెరాస జాబితా విడుదలవుతుందని అనుకొన్నప్పటికీ, కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తరువాతే తెరాస జాబితాను విడుదల చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ శుక్ర లేదా శనివారం జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కనుక తెరాస జాబితా ఆదివారం ప్రకటించవచ్చు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు కవిత (నిజామాబాద్‌), జి.నగేశ్‌ (ఆదిలాబాద్‌), బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), కొత్తపల్లి దయాకర్‌ (వరంగల్) పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వారితో పాటు టికెట్ కేటాయించబోతున్న మిగిలిన అభ్యర్ధులతో సిఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. సిట్టింగ్ ఎంపీలలో టికెట్ కేటాయించరనుకొంటున్న (జితేందర్ రెడ్డి, అజ్మీరా సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి)లతో కూడా సిఎం కేసీఆర్‌ వేర్వేరుగా భేటీ అయ్యి వారికి ఈసారి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారో వివరించి, అందుకు బదులుగా వారికి ఎటువంటి అవకాశాలు కల్పించబోతున్నారో వివరించబోతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ జాబితా ప్రకటించేవరకు వేచి చూడాలని సిఎం కేసీఆర్‌ భావిస్తుండటం నిజమైతే, తెరాస జాబితాలో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది కనుక హామీ లభించిన అభ్యర్ధులకు ఇది ఆందోళన కలిగించే విషయమే.