అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఏపీ నూతన రాజధాని

SMTV Desk 2017-08-08 13:04:31  Amaravathi, Andhrapradesh Capital city, Thulluru, Youth, Anti Social Events

అమరావతి, ఆగష్ట్ 8: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఆకతాయిలకు అడ్డాగా మారింది. ఇంకా పూర్తి స్థాయిలో పరిపాలన ఇక్కడ నుంచి జరగకపోవడం, నిర్మాణ దశలోనే కొన్ని భవనాలు ఉండటం, రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో పంట పొలాలను ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కన పరిసర ప్రాంతాల నుంచి యువత ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో తూగుతూ, బహిరంగ శృంగారానికి పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఓ అమ్మాయితో వచ్చిన నలుగురు యువకులు మెల్లెంపూడి - గుండిమెడ రోడ్డుపై గంజాయి తాగుతుండగా, స్థానికుడొకరు వెళ్లిపోవాలని సూచించగా, అమ్మాయిని మొదట పంపేసి, తరువాత రైతుపై దాడి చేసి పారిపోయిన వైనం చోటు చేసుకుంది. తాడేపల్లి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు, ఓ యువతితో పాటు వచ్చి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తుండగా, చూసిన కానిస్టేబుల్ అడ్డుకోబోగా, సదరు యువతి రేప్ చేయబోయావంటూ ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఉండవల్లి గుహల నుంచి సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో మద్యం మత్తులో రోడ్డుపై బహిరంగ శృంగారం చేస్తున్న యువతీ, యువకుడిని సీఎం విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసు సిబ్బంది గట్టిగా మందలించి పంపాల్సి వచ్చింది. మంగళగిరి – కృష్ణాయపాలెం రోడ్డు, ఉండవల్లి – అమరావతి, కరకట్ట నుంచి రాయపూడి వరకు రాత్రి పూట ఆడా, మగా తేడా లేకుండా పార్టీలు జరుపుకుంటూ, గొడవలకు దిగుతున్నారని, ఇక్కడి పరిస్థితులతో మేము భయాందోళనల మధ్య జీవించడం కష్టంగా ఉంటుంది అంటూ స్థానికులు వాపోతున్నారు.