క్రికెట్ దిగ్గజాలను గుర్తుకు తెచ్చిన కుశాల్ మెండిస్

SMTV Desk 2017-08-08 12:33:26  Kushal Mendis, Srilanka Cricketer, Kohli, Ashwin, Jadeja

కొలంబో, ఆగష్ట్ 8: శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‍ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ నుంచే భారత్ విజృంభించిన సంగతి విదితమే. మొదట్నుంచి టీమిండియా గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అలానే సీరీస్ను సొంతం చేసుకుంది కానీ, భారత ఆటగాళ్లకు కొత్త పోటీదారుడు పరిచయం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ కుర్రాడు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, టీమిండియాను మైదానం మొత్తం పరుగెట్టించాడు. ఆ కుర్రాడే కుశాల్ మెండిస్, ఒక వికెట్ పడిన తర్వాత పిచ్‌లోకి దిగి తనదైన రీతిలో భారత స్పిన్నర్లను కట్టడి చేసి, చుక్కలు చూపించాడు. అశ్విన్, జడేజాలు వారి బౌలింగ్‌తో దాడికి దిగితే, మెండిస్ తన షాట్లతో వారిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒకానొక దశలో తన షాట్లకు భారత ఆటగాళ్ళు బౌండరీ లైన్ దగ్గర మాత్రమే కాపుకాయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏలా ఉండి ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. ఓ ప్రణాళికా బద్ధంగా బంతి టర్న్ లేదా బౌన్స్ కావడానికి ముందే తన బ్యాటుతో బాదేస్తూ మెండిస్ సీనియర్ ఆటగాళ్లను సైతం తన మాయలో పడేశాడు. 17 బౌండరీలు చేసిన మెండిస్ 8 స్వీప్ షాట్లను ఆడటం సచిన్, గూచ్, ఆండీ ఫ్లవర్ వంటి క్రికెట్ దిగ్గజాలను గుర్తుకు తెచ్చింది. స్వయంగా టీమిండియా సారధి కోహ్లీనే మెండిస్ షాట్లను కొనియాడటం ఈ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూర్చాయి. మహేల, సంగక్కార వంటి క్రికెటర్ల వారసుడిగా 21 ఏళ్ల మెండిస్ నిలుస్తాడని లంకేయులు అభిప్రాయపడుతున్నారు.