మమతా బెనర్జీపై బిజెపి నేతల ఫిర్యాదు

SMTV Desk 2019-03-14 09:14:29  mamatha benarjee, trinamool congress party, loksabha elections, bjp, election commission

న్యూఢిల్లీ, మార్చ్ 13: బుధవారం పశ్చిమబెంగాల్ సిఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీపై బిజెపి నేతలు ఇసికి ఫిర్యాదు చేశారు. బెంగాల్ లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని బిజెపి నేతలు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఇసిని కలిసి పశ్చిమబెంగాల్ ను సమస్యాత్మక రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు. బెంగాల్ లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, అల్లర్లలో మృతి చెందిన వారి వివరాలుతో పాటు బిజెపి నేతల హెలికాప్టర్ల ల్యాండింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వంటి అంశాలపై బిజెపి నేతలు ఇసికి వినతిపత్రం అందించారు. ఇదిలా ఉండగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిజెపి ఓటమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. అవసరమైతే మోడీ పోటీ చేసే స్థానాల్లో, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మమత ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా బిజెపి నేతలు ఇసికి ఫిర్యాదు చేశారు. మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము ఇసిని కోరినట్టు బిజెపి నేతలు తెలిపారు.