వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం

SMTV Desk 2019-03-13 15:43:14  supreme court, vasavi engineering college, high court, justice arun mishra

న్యూఢిల్లీ, మార్చ్ 13: ఈ రోజు సుప్రీం కోర్టులో వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల వ్యవహారంపై విచారణ జరిగింది. ఈ విచారణలో సుప్రీం కోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫీజుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు సరికాదని వెల్లడించింది. ద్విసభ ధర్మాసనం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలో ఈ ఫీజుల వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఫీజుల నిర్ణయాధికారం ప్రభుత్వ ఫీజు నియంత్రణ మండలికే ఉంటుందని పేర్కొంది. కాగా ఫీజు నిర్ణయాధికారం కళాశాలలకే ఇవ్వాలని కళాశాల తరపు న్యాయవాది కోరారు. ఫీజు నిర్ణయంపై వాసవి కళాశాల తరపు న్యాయవాది వాదనలతో సుప్రీం ఏకీభవించలేదు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రైవేటు కళాశాలలు ఎలా నడుస్తాయో తమకు తెలుసని పేర్కొంది. అధ్యాపకులు లేకున్నా కొన్ని కళాశాలలు ఉన్నట్లు చెబుతాయంది. ఫీజుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని పిటిషనర్లు వాసవి కళాశాల పేరెంట్స్‌ అసోషియేషన్‌, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.