తెరాస లోక్‌సభ అభ్యర్ధుల పేర్లు ఖరారు?

SMTV Desk 2019-03-13 15:40:01  TRS, Telangana,

హైదరాబాద్, మార్చ్ 13: ఈనెల 25వ తేదీతో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు రెండు మూడు రోజులలోగానే తమ తమ అభ్యర్ధులను ప్రకటించబోతున్నాయి. కాంగ్రెస్‌, తెరాసలు ఈనెల 15న, బిజెపి 16న తమ అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దం అవుతున్నాయి.

సిఎం కేసీఆర్‌ ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు కవిత (నిజామాబాద్‌), జి.నగేశ్‌ (ఆదిలాబాద్‌), బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), కొత్తపల్లి దయాకర్‌ (వరంగల్) పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి సిట్టింగ్ ఎంపీలు జితేందర్ రెడ్డి, అజ్మీరా సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పక్కన పెట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే సిఎం కేసీఆర్‌ వారిని ప్రజాప్రతినిధుల సమావేశానికి ఆహ్వానించలేదని వార్తలు గుప్పుమన్నాయి.

జితేందర్ రెడ్డి స్థానంలో శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జి వివేక్ (పెద్దపల్లి), కవిత (మహబూబాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ (సికిందరాబాద్‌), వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ (ఖమ్మం), నవీన్ రావు (మల్కాజ్‌గిరి), నర్సింహారెడ్డి, టి చిన్నప్ప రెడ్డి (నల్గొండ) తదితరులు టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. సిఎం కేసీఆర్‌ ఈ నెల 15వ తేదీన 15మంది అభ్యర్ధులను ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం.