జీతాల్లేవ్ అంటున్న బీఎస్ఎన్ఎల్!

SMTV Desk 2019-03-13 14:23:52  BSNL, JIO, BSNL Employees return home, no salery

న్యూఢిల్లీ, మార్చ్ 13: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనాలను చెల్లించడంలో విఫలమైంది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడంలో డిఫాల్ట్ కావడం ఇదే తొలిసారి. ఎంప్లాయ్ యూనియన్లు ఇప్పటికే టెలికం మంత్రి మనోజ్ సిన్హాకు ఈ విషయమై లేఖ కూడా రాశాయి. ఇందులో వేతనాల చెల్లింపుల కోసం సంస్థకు నిధులు విడుదల చేయాలని కోరారు. అదేసమయంలో సంస్థ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రిలయన్స్ జియో ధరల పోటీ కారణంగా టెలికం పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులోకి జారుకుందని యూనియన్లు లేఖలో పేర్కొన్నాయి. ఇతర టెలికం సంస్థలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అయితే అవి ఎలాగొలా పరిస్థితులను నెట్టుకొస్తున్నాయని తెలిపారు.మార్చి నెల వేతనాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీఎస్ఎన్ఎల్ బోర్డు.. బ్యాంక్ రుణానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే టెలికం విభాగం ఇందుకు నిరాకరించినట్లు సమాచారం.