రాహుల్ గాంధీ పై కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ..

SMTV Desk 2019-03-13 14:08:12  Rahul gandhi,

న్యూ ఢిల్లీ, మార్చ్ 13: రాజకీయ నేతలు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంతో ఏదో ఒక సందర్భంలో మాట తూలినా తర్వాత తమాయించుకోవాలి. అలాకాకుండా ఆ మాటలనే పదేపదే అంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. తాను ప్రభుత్వ ఖజానాకు కాపలాదారుగా(చౌకీదార్) ఉంటానని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించే వ్యంగ్యాస్త్రాలు సెక్యూరిటీ గార్డుల ఆగ్రహానికి దారి తీశాయి.

రఫేల్ విమానాల ఒప్పందం, వంటి ఒప్పందాల్లో మోదీ చౌకీదార్ కాదని, చోర్ అని రాహుల్ అంటుంటారు. ‘చౌకీదార్‌ చోర్‌ హై‘(కాపలాదారే దొంగ) అని దాదాపు ప్రతిసభలోనూ విమర్శిస్తున్నారు. దీనిపై ముంబై సెక్యూరిటీ గార్డ్ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ తమ వృత్తి అవమానిస్తున్నారని, ఆయనపై కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర రాజ్య సురక్షా రక్షక్‌ యూనియన్‌ తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. రాహుల్ మొదట్లో ఏదో ఆవేశంలో అని ఉంటాడులే అని సరిపెట్టుకున్నామని, కానీ ఆయన పదేపదే చౌకీదార్ చోర్ హై అనడం సబుబుగా లేదని అసోసియేషన్ పేర్కొంది. ఇటీవల ముంబై ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ మైదానంలోనూ ఆ మాట అన్నాడని తెలిపింది.