భారత్-ఆసిస్ ఆఖరి వన్డే...దశాబ్దం నిరీక్షణకు తెరదించాలని ఆసీస్‌ ! సొంతగడ్డపై సత్తా చాటాలని టీమ్‌ఇండియా !

SMTV Desk 2019-03-13 13:34:52  india vs australia, odi, virat kohli, new delhi, firoz shah kotla stadium

హైదరాబాద్, మార్చ్ 13: భారత్, ఆసిస్ మధ్య జరుగతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో ఐదు వన్డేల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచిన భారత్, ఆసీస్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విదేశీ గడ్డపై జైత్రయాత్ర సాగించిన కోహ్లి సేనకు సొంతగడ్డపై ఆసీస్‌ సవాల్‌ విసురుతోంది. తొలి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్‌ విజయం ఖాయమనుకున్న తరుణంలో… ఆసీస్ అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ సమం చేసింది. మొహాలీ వన్డేలో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్… రెట్టించిన ఉత్సాహంతో ఫైనల్ వన్డేలో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌కు ముందు భారత గడ్డపై వన్డే సిరీస్‌ గెలవాలని కంగారూలు కసిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వన్డే టీమ్‌ఇండియాకు ఎంతో కీలకంగా మారింది.