హైదరాబాద్‌ నుంచే కేంద్రాన్ని శాశిద్దాం: కేటీఆర్‌

SMTV Desk 2019-03-13 12:52:22  TRS,

హైదరాబాద్,మార్చ్ 13: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్రంలో ఇప్పుడు ఏ పార్టీ కూడా సొంతబలంతో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి కూటమి 150-160 సీట్లు, కాంగ్రెస్‌ కూటమి 100 సీట్లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కనుక జాతీయ రాజకీయాలలో తెరాస కీలకపాత్ర పోషించే సమయం ఆసన్నమైంది. తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకొన్నట్లయితే మిత్రపక్షాలతో కలిపి 100 సీట్లు అవుతాయి. అప్పుడు కేంద్రప్రభుత్వాన్ని మనమే శాశించవచ్చు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో మనమే నిర్ణయించవచ్చు. అప్పుడు మనం డిల్లీ చుట్టూ తిరగనవసరం లేదు. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయరాజకీయాలు జరుగుతాయి. కేంద్రాన్ని శాశించే శక్తి మన చేతుల్లో ఉంటే మన రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, వాటికి జాతీయహోదా వంటివన్నీ సాధించుకోవచ్చు. కనుక లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు 16 ఎంపీ స్థానాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను,” అని అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ పార్టీలో జానారెడ్డి వంటి పెద్ద పెద్ద నేతలే ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెల్లాచెదురైపోతోంది. లోక్‌సభ ఎన్నికలను చూసి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు చలిజ్వరం వచ్చినట్లు వణికిపోతున్నారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మనకు ఏమాత్రం పోటీ కాదు,” అని కేటీఆర్‌ అన్నారు.