ఉగాదికి 'ప్రేమకథా చిత్రమ్ 2'

SMTV Desk 2019-03-12 07:25:56  horror, ugadhi,

హైదరాబాద్, మార్చ్ 11: తెలుగులో వచ్చిన హారర్ కామెడీ చిత్రాలలో ప్రేమకథా చిత్రమ్ స్థానం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . యూత్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. భారీ వసూళ్లతో ఈ సినిమా సుధీర్ బాబుకి మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ప్రేమకథా చిత్రమ్ 2 నిర్మితమైంది. సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా .. నందిత శ్వేత నాయికగా ఈ చిత్రం రూపొందింది.

సుదర్శన్ రెడ్డి నిర్మాతగా .. హరికిషన్ దర్శకుడిగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో దెయ్యం పాత్రలో నందిత శ్వేత అదరగొట్టేసింది. దాంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ప్రేమకథతో ముడిపడిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకూ భయపెడుతుందో చూడాలి.