ఒకే లోక్‌ సభ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్‌

SMTV Desk 2019-03-11 10:08:05  jammu kashmir, lok sabha seat, election

శ్రీనగర్, మార్చి 11: ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా, సమస్యల్లేకుండా కొనసాగేందుకు వీలుగా ఎన్నికల కమిషన్‌ విడతల వారీగా పోలింగ్‌ నిర్వహిస్తుంది. అయితే ఇది వివిధ రాష్ట్రాలకు, రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు తగ్గట్టుగా షెడ్యూల్ వుంటుంది. కానీ జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో ఒకే లోక్‌ సభ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్‌ జరుగుతుండడం విశేషం. దక్షిణ కశ్మీర్‌ లోయలో ఉన్న అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు నిన్న ఎన్నికల షెడ్యూల్‌లో ఈసీ ప్రకటించింది. ఇక్కడ ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉండడంతో భద్రతా సిబ్బందికి పొంచివున్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ సునీల్‌ అరోరా ప్రకటించారు. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలు ఉండగా వీటికి ఐదు విడతల్లో పోలింగ్‌ జరుగుతుండడం మరో విశేషం. ఇక, గతంలో గరిష్టంగా రెండు దశల్లో ఎన్నికలు పూర్తిచేసిన జార్ఖండ్‌, ఒడిశాల్లో కూడా నాలుగు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌లో14 స్థానాలు, ఒడిశాలో 21 స్థానాలు ఉన్నాయి.