ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం

SMTV Desk 2019-03-11 10:07:09  summer, sunlight, summer temperatures

హైదరాబాద్, మార్చి 11: వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరగనున్నాయి. ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) హెచ్చరికలు జారీ చేసింది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా పేర్కొంది.

ఆదివారం నాగర్‌కర్నూలు, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల, వనపర్తి తదితర ప్రాంతాల్లో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వరుసగా 38, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికం. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. భద్రాచలం, ఖమ్మంలో శనివారం సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.