'టర్నర్ ' వీరోచిత ఇన్నింగ్స్ .. సిరిస్ 2-2తో సమం

SMTV Desk 2019-03-11 08:44:21  Turner,

మొహాలీ, మార్చ్ 11: ఆస్ట్రేలియా తో జరిగిన నాలుగో వన్‌డేలో భారత్ పరాజయం పాలయింది. స్కోరుబోర్డుపై 358 పరుగుల భారీ లక్షాన్ని ఉంచినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో టీం ఇండియా విఫలమైంది. ఆసీస్ బ్యాటింగ్ ధాటికి అంత భారీ స్కోరు సైతం చిన్నబోయింది.ఇంకా 13 బంతులు ఉండగానే కేవలం ఆరు వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించిన ఆసీస్ భారత్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆష్టన్ టర్నర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 84 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే ఒక్కసారిగా మార్చి వేశాడు.ఆసీస్ లక్ష ఛేదనలో ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్ వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ఖావాజా (91), పీటర్ హాండ్స్‌కోంబ్(117)లు మూడో వికెట్‌కు 192 పరుగులు జోడించడంతో ఆసీస్ తేరుకుంది. ఖావాజా 99 బంతుల్లో 7 బౌండరీలతో 91 పరుగులు చేసి ఔట్ కాగా, హాండ్స్‌కోంబ్ కేవలం 105 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, 8 బౌండరీలతో 117 పరుగులు చేసి ఆసీస్ రన్‌చేజ్‌కు అవసరమైన ఊపును అందించాడు. అయితే లక్షం భారీది కావడంతో భారీ షాట్లకు యత్నించే క్రమంలో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మాక్స్‌వెల్, వికెట్ కీపర్ కారీలు కూడా బ్యాట్ ఝళిపించినప్పటికీ ఎక్కువ సేపు నిలవలేదు.

అయితే మ్యాచ్ విన్నర్ టర్నర్ మాత్రం బౌండరీలే లక్షంగా చెలరేగి పోయాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదాడు. అతని ధాటికి భారత ఫీల్డర్ల తప్పిదాలు కూడా కలిసి వచ్చాయి. టర్నర్ మూడు సార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. జాదవ్ ఒకసారి, ధావన్ మరోసారి చేతికందివచ్చిన క్యాచ్‌లను జారవిడవగా, రిషబ్ పంత్ ఒక సారి స్టంపింగ్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీంతో ఒకప్పుడు మాచ్ విన్నర్లుగా నిలిచిన చాహల్, కుల్దీప్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా లాంటి వాళ్లు కూడా భారీ పరుగులు ఇచ్చుకున్నారు. చాహల్ పది ఓవర్లు బౌట్ చేసి ఏకంగా 80 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన భారత్ బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ఘోరంగా విఫలమై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. దీంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్ 22 స్కోరుతో సమమైంది. ఇక నిర్ణయాత్మక చివరి మ్యాచ్ ఈ నెల 13న ఢిల్లీలో జరగనుంది.