లోక్ సభ ఎన్నికల నగారా మోగింది...ఏప్రిల్ 11 నుంచి ఎన్నికలు ప్రారంభం

SMTV Desk 2019-03-11 07:32:20  central election commission, press meeting, lok sabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 10: కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా మీడియాతో మాట్లాడుతూ...దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని, ఏప్రిల్ 11 నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రెండోవ విడత ఎన్నికలు ఏప్రిల్-18న, మూడోవ విడత ఎన్నికలు ఏప్రిల్-23న, నాలగోవ విడత ఎన్నికలు ఏప్రిల్-29న, ఐదోవ విడత ఎన్నికలు మే6న, ఆరోవ విడత ఎన్నికలు మే-12న, మే-19న ఏడోవ విడతతో ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. ఒకే దశలో తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఆదివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పార్లమెంట్ ఎన్నికలు జరుతాయని, కర్నాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపురలో రెండో దశల్లో ఎన్నికలు, అసోం, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో లోకసభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఆరోరా తెలిపారు. ఏప్రిల్11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్ దాఖలు మార్చి 18 నుంచి 25 వరకు వేసుకోవచ్చన్నారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, మార్చి 28వ తేదీన నామినేషన్లను ఉపసంహరణ చేసుకోవచ్చని ఆరోరా సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసే ముందు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించామని సిఇసి పేర్కొంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వివిధ విభాగాల భద్రతాధికారులు, ఉన్నతాధికారులు, అన్నీ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డిజిపిలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఎన్నికల జరుపుతున్నామని వివరించారు. 18 నుంచి 19 ఏళ్ల లోపు వారు కోటీ 50 లక్షల మంది ఉన్నారని, ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తరువాత ఓట్లు తొలగించడానికి అవకాశం లేదని, 99.36 శాతం మందికి ఓటరు గుర్తింపు కార్డులున్నాయని, ఈ సారి ఇవిఎంలపై అభ్యర్థి ఫోటో పెడుతున్నామని ఆరోరా స్పష్టం చేశారు. 1950 టోల్ ఫ్రీ ద్వారా ఓటును చెక్ చేసుకోవచ్చని ఆరోరా సూచించారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ సారి మొత్తం ఓటర్ల సంఖ్య 90 కోట్లకు చేరిందన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఇవిఎంలతో పాటు వివి ప్యాట్‌లను ఏర్పాటు చేశామన్నారు. సున్నిత ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలింగ్ అబ్జర్వర్లు ఉంటారని, జూన్-3తో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందన్నారు.