టీడీపీలోకి చేరిన వైసీపీ ఎమ్మెల్యే, కేసీఆర్ పై మండిపడ్డ బాబు

SMTV Desk 2019-03-10 10:08:06  Chandrababu Naidu, Charitha Reddy, Chandrasekhar Rao, Jaganmohan Reddy, Party Changing, TDP, YCP

అమరావతి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పసుపు కండువాను కప్పి గౌరు చరితారెడ్డి దంపతులను ముఖ్యమంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలువురు కర్నూలుకు చెందినా వైసీపీ నాయకులూ టీడీపీ లో చేరారు. ఈ నేపథ్యంలో చరితారెడ్డి మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ప్రజలకు తాగునీటిని అందించడానికి గుండ్లేరుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని, అలాగే ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి కేసీఆర్‌కు ఆ ఓటమిని రిటర్న్ గిఫ్ట్‌గా పంపిస్తానని అన్నారు. కేసీఆర్ ఒక్క కేసు పెడితే తాను పది కేసులు పెట్టగలనని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పంచన చేరి ఏపీపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.