భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ .. ఈ వింత సంఘటన గమనించారా ?

SMTV Desk 2019-03-09 12:54:27  India, Australia,

రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఆతిథ్య భారత్ ఇప్పటికే 2-1తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇక శుక్రవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన చివర వరకు పోరాడిన ఓటమి రుచి చూడక తప్పలేదు. ఆసీస్ విసిరిన 314 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 48.2 ఓవర్లలో 281 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ కోహ్లీ శతకంతో ఆకట్టుకున్నాడు.

ఇదిలాఉంటే ఈ సిరీస్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియా 48.2 ఓవర్లు మాత్రమే ఆడడం గమనార్హం. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 236/7 చేయగా, భారత్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 48.2 ఓవర్లలో 250 పరుగులకే కుప్పకూలింది. ఇక శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లోనూ మరోసారి సరిగ్గా 48.2 ఓవర్ల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. ఇది యాదృచ్ఛికమే అయినా మూడు వన్డేల్లోనూ సరిగ్గా అదే ఓవర్, రెండో బంతి వరకే ఆడటం మాత్రం విచిత్రమే. బహుశా క్రికెట్ చరిత్రలో ఒక జట్టు వరుసగా మూడు మ్యాచుల్లో ఇలా సరిగ్గా అన్నే ఓవర్లు ఆడటం అనేది ఇదే తొలిసారి కావొచ్చు.