"ఫ్లెక్సీ ఫేర్" విధానంతో రైల్వేశాఖకు అదనపు ఆదాయం

SMTV Desk 2017-08-06 16:24:05  flexi fare railway system, extra charges

హైదరాబాద్, ఆగస్ట్ 6 : గతేడాది సెప్టెంబర్ 9న రైల్వేశాఖలో ప్రారంభించిన ఫ్లెక్సీ ఫేర్ విధానం రైల్వే వ్యవస్థకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలు (ఫ్లెక్సీ–ఫేర్‌) విధానంలో మరోసారి మార్పులు తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ విధానంలో అందుబాటులో ఉన్న సీట్లు చాలా మిగులుతుండటంతో సవరణలు చేయాల్సిందిగా రైల్వే మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఈ విధానం ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 10 శాతం బెర్తులను సాధారణ ధరలకే కేటాయిస్తారు. ఆ తర్వాత ప్రతి 10 శాతం సీట్లు నిండే కొద్దీ ఛార్జీ మరో 10 శాతం పెరిగిపోతుంటుంది. చివర్లో టికెట్లు కొనుగోలు చేసే వారు గరిష్టంగా 50 శాతం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతుండగా, రైల్వే శాఖకు మాత్రం కాసుల పంట పండుతుంది. ఇప్పటి వరకు అదనంగా రూ.540 కోట్ల ఆదాయం వచ్చి చేరిందని, దీన్ని నిలిపివేయడానికి ఎటువంటి కారణం లేదంటూ రైల్వేశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.