ఇది కేవలం ప్రారంభం మాత్రమే ..

SMTV Desk 2019-03-08 12:32:00  modi, jana aushadam

జనౌషధి పథకం కారణంగా సామాన్య ప్రజలకు రూ.1000 కోట్లు ఆదా అయిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సరసమైన ధరలకు మందులు అందించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తక్కువ ధరకు అత్యుత్తమ నాణ్యత కలిగిన మందులు అందుబాటులోకి తేవడం కోసం ప్రభుత్వం రెండు చర్యలు తీసుకుందని, మొదటి చర్యగా 850 అత్యవసర మందుల ధరలను క్రమబద్ధీకరించడంతో పాటుగా స్టెంట్‌లు, మోకాలి శస్త్ర చికిత్సకు వాడే పరికరాల ధరలను తగ్గించిందని ప్రధాని చెప్పారు. రెండో చర్యగా దేశవ్యాప్తంగా వందలాది జనౌషధి కేంద్రాలను తెరిచిందని,ఈ చర్యలు వల్ల పేదలే కాకుండా మధ్య తరగతి వారికి ఎంతో మేలు జరిగిందని ఆయన చెప్పారు. ఒక్క జనౌసధి పథకం ద్వారానే లక్షలాది కుటుంబాలకు రూ.1000 కోట్లకు పైగా ప్రయోజనం కలిగిందని, అదికూడా ఈ పథకం గురించి ప్రచారం జరగనప్పుడే ఇంత ప్రయోజనం చేకేరిందని మోడీ చెప్పారు.

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి లబ్ధిదారులు, దుకాణదారులతో ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జనౌషధి కేంద్రాల్లో మందులు మార్కెట్ ధరలకన్నా 50నుంచి 90 శాతం తక్కువ ధరలకు లభిస్తాయని ఆయన చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో దేశవ్యాప్తంగా 5 వేలకు పైగా జనౌషధి కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఈ కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందించడమే కాకుండా వేలా ది మందికి స్వయం ఉపాధి కల్పించడంతో పాటుగా కొత్త ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఈ పథకం గురించి జనంలో అవగాహన కల్పించడం కోసం డిసెంబర్ 7 వ తేదీని ‘జనౌషధి దివస్’గా పాటించ డం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. వైద్య రంగంలో సమూలమైన మార్పు తీసుకు రావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.