ఇంకా సమయం ఉంది

SMTV Desk 2019-03-08 11:55:54  Election Commission, Lok Sabha, Polls, OP Rawath, Assembly Elections

న్యూఢిల్లీ, మార్చి 8: యావత్ దేశం పార్లమెంట్ ఎన్నికల కొరకు ఎదురుచూస్తుంది. ఎన్నికల సంఘం(ఈసీ) లోక్ సభ ఎన్నికల కొరకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల ఆఖరిలోగ తొలి దశ ఎన్నికల తేదిని ప్రకటించనున్నారు. ఈ తొలి దశ ఎన్నికల తేది ప్రకటించిన తరువాత ఏప్రిల్ మొదటి రెండు వారంలో ఎన్నికలు జరగవచ్చని అంచనా. వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరిగే ఎన్నికల కొరకు అవసరమైన సామగ్రి తరలింపు పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్‌ 3వ తేదీతో ముగియనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు భేటి కానున్నారు. 7 లేదా 8 దశల్లో జరగనున్న ఈ ఎన్నికలకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ఈసీ సీనియర్‌ అధికారులు వెల్లడించారు.

లోక్ సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. గవర్నర్‌ పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులున్న నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టాయి. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించలేదు. 2014 ఎన్నికలకు మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రకటన వెలువడింది. ఈసారి 5వ తేదీ దాటిపోయినా ఇంకా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ జాప్యం చేయడం లేదని, నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన జారీకి ఇంకా సమయం ఉందని మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్‌ అన్నారు.