తెలంగాణ డేటాను ఐటీ గ్రిడ్ సేకరించింది : ఐజీ స్టీఫెన్ రవీంద్ర

SMTV Desk 2019-03-08 11:38:24  it grids company, it grids company case, ceo ashok, data deleted in systems, cyberabad police, ig stephen ravindra

హైదరాబాద్, మార్చ్ 07: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసుపై పలు విషయాలు వెల్లడించారు. గురువారం నాడు ఐటీ గ్రిడ్‌పై ఏర్పాటు చేసిన సిట్ ప్రత్యేకాధికారి స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.... ఐటీ గ్రిడ్‌పై ఏర్పాటు చేసిన సిట్ విచారణను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ సేకరించిందని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు సైబరాబాద్, హైద్రాబాద్ పోలీసులు జరిపిన విచారణ గురించి తెలుసుకొన్నామని, ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈ కేసులో సైబర్ నిపుణుల అవసరం ఉందని అన్నారు. ఈ సిట్‌ బృందంలో 9 మంది ఉన్నట్టు ఆయన తెలిపారు. సేవా మిత్ర యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ డేటాను అవకతవకలను ఏమైనా చేశారా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆశోక్ ఎక్కడ ఉన్నా అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా విచారిస్తామని చెప్పారు. ఈ కేసు నిష్పక్షపాతంగా కొనసాగించనున్నట్టు ఆయన తెలిపారు. టెక్నికల్‌గా నిపుణులు అవసరం ఉందని చెప్పారు. ఐటీ గ్రిడ్ సీఈఓ పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. లబ్దిదారుల డేటా ఈ యాప్‌లోకి ఎలా వచ్చింది, ఎవరు ఈ డేటాను ఇచ్చారనే విషయాన్ని ఆరా తీస్తున్నట్టు ఆయన తెలిపారు. ఐటీ గ్రిడ్ నుండి సీజ్‌ చేసిన వస్తువుల్లో కొంత సమాచారాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. ఆశోక్‌ను చట్టపరంగానే తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవా మిత్రలోని కొన్ని ఫీచర్లు పనిచేయకుండా చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.