తెలంగాణకు 4 అవార్డులు

SMTV Desk 2019-03-07 15:52:39  telangana,

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి గత నాలుగున్నరేళ్ళలో అనేక అవార్డులు లభించాయి. తాజాగా మరో నాలుగు అవార్డులు లభించాయి. రాష్ట్రంలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, సిరిసిల్ల, సిద్దిపేట నాలుగు మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్‌– 2019 అవార్డులు గెలుచుకొన్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీలు దక్షిణ భారతదేశంలో టాప్-10 మున్సిపాలిటీల జాబితాలో నిలిచాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌– 2019 పధకాన్ని అమలుచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 4,238 పట్టణాలలో ఈ పధకం అమలవుతోంది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో పరిశుభ్రత పాటించినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసింది.

బుదవారం డిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌పురి చేతుల మీదుగా బోడుప్పల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఉపేందర్‌ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ మోహన్‌, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావని దేవదాస్, మున్సిపల్‌ కమిషనర్‌ కేవి రమణాచారి, మీదుగా సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు.