నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలకలం

SMTV Desk 2019-03-07 13:43:19  Hyderabad, Nampalli,

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలకలం రేగింది. పిల్లలకు వేసిన వ్యాక్సిన్‌ వికటించడంతో 15 మంది అస్వస్థులయ్యారు. దీంతో బాధితులందరినీ హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం అదేం లేదని కొట్టిపారేస్తున్నాయి.

వ్యాక్సిన్‌ వేసిన వెంటనే నొప్పి రాకుండా వేయాల్సిన మందులను వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, అస్వస్థులైన చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. బాధితులను నీలోఫర్‌ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న హైదరాబాద్‌ డీఎంహెచ్‌ఓ, ఇతర వైద్యశాఖ అధికారులు హుటాహుటిన చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారులంతా ఒకటిన్నర ఏళ్లులోపు వయసువారేనని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీకా వేసిన రెండు గంటల్లోపే పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆరోపిస్తున్నారు. నిన్న నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో మొత్తం 90 మంది పిల్లలకు టీకాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు.


మరోవైపు ఈ ఘటనపై వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హుజురాబాద్ నుంచి ఆయన నిలోఫర్ ఆస్పత్రికి బయల్దేరారు.