అయోధ్య వివాదం : మధ్యవర్తి నియామకాన్ని రిజర్వ్ లో పెట్టిన సుప్రీం

SMTV Desk 2019-03-06 16:58:50  supreme court, ayodhya temple, babree masjid, justice rangan gogoy

న్యూఢిల్లీ, మార్చ్ 06: అయోధ్యలో రామ మందిరం, బాబ్రీమసీద్ వివాదం కేసులో ఈ రోజు సుప్రీం కోర్టు పలు కీలక విషయాలపై చర్చలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని కోర్టు అధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అందించాలా లేదా అన్న దానిపై సుప్రీం తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. అంతేకాక ఇది కేవలం భూవివాదం మాత్రమే కాదని, మత విశ్వాసానికి చెందిని సున్నిత అంశం అని, గతాన్ని మనం మార్చలేం అని, అప్పట్లో ఎవరెవరు ఏం చేశారన్నది ఇప్పుడు అప్రస్తుతం అని, ప్రస్తుత వివాదాన్ని మాత్రమే మేం పరిగణలోకి తీసుకుంటాం అని , దాన్ని మాత్రమే మేం పరిశీలిస్తాం అని ఈ అంశంపై ధర్మాసనం తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. ఈ వివాద పరిష్కారానికి ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అని భావిస్తున్నాం అని జస్టిస్‌ బోబ్డే అన్నారు. కాగా ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గోగోయ్, జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్యాసనం నేడు విచారణ చేపట్టింది. ఇక మధ్యవర్తి నియమించడంపై హిందూ సంఘాలు వ్యతిరేఖత తెలుపగా ఇస్లాం వర్గీయులు మాత్రం దీనికి మద్దతుగా ఉన్నారు. అలాగే యుపి ప్రభుత్వం కూడా మధ్యవర్తి నియామకాన్ని వ్యతిరేకించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఈ అంశంపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది. ఐతే ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే గనుక ఇరు పక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గోగోయ్ స్పష్టం చేశారు.