అక్కడికి వెళ్లి చూడండి ఆధారాలు కనిపిస్తాయి: రాథోడ్‌​

SMTV Desk 2019-03-05 15:22:34  Rajyavardhan Singh Rathore, Kapil Sibal, Congress, BJP, Pulwama Attack

న్యూఢిల్లీ, మార్చి 5: పుల్వామా ఉగ్రదాడి తరువాత ఆగ్రహంతో ఉన్న భారత్ ప్రతీకార చర్యగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై వైమనికా దళం దాడి జరిపిన సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం జరిపిన ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు అనేది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై స్పందించిన కాంగ్రెస్, బీజేపీ కట్టుకథలతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించింది. అలాగే, బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌నేత కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖమంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌​ తిప్పికొట్టారు. ఈ విషయం పట్ల వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

"గత పార్లమెంట​ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయని కాంగ్రెస్‌ నేతలు బ్రిటన్‌ వెళ్లి అక్కడ ఆధారాలు ఉన్నాయంటూ తమపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బాలాకోట్‌ వెళ్లి పరిశీలించి దాడులు జరిగాయో లేదో చెప్పండి. అక్కడే సరైన ఆధారాలు దొరుకుతాయి" అని రాథోడ్‌ బదులిచ్చారు. ఈ దాడులపై సరైన అధారాలు లేవని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం మీకు (కాంగ్రెస్‌) చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. "కపిల్ సిబాల్ గారూ.. మీరు మన బలగాల మాటను కాదని అంతర్జాతీయ మీడియా కథనాలను విశ్వసిస్తున్నారా?" అంటూ ప్రశ్నించారు.