కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న అభినందన్ మీసకట్టు, 650మందికి ఉచితంగా...

SMTV Desk 2019-03-05 12:58:25  Abhinandan, Whiskers, New Trend, Nanesh Takur

న్యూఢిల్లీ, మార్చి 5: ఒక్కరోజులోనే హీరోగా అయిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ మీసాలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ చెర నుండి విడుదలైన ఆయన మీసం స్టైల్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ప్రస్తుతం చాలా మంది యువకులు ఆయన తరహ మీసాలను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక హెయిర్‌ డిజైనర్‌ ననేష్‌ ఠాకూర్‌ ఏకంగా 650 మందికి ఉచితంగా అభినందన్‌ను పోలిన జుట్టు, మీసాలు కత్తిరించి సంచలనం సృష్టించారు. ఈ విషయం పట్ల ఆయన మాట్లాడుతూ, "అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తుంది. ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని నా సెలూన్‌లో ఒక రోజంతా ఉచితంగా అభినందన్‌ హెయిర్‌స్టైల్‌ చేయాలని భావించాను. యువతలో దేశ భక్తిని పెంపొందించి.. వారిని డిఫెన్స్‌ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సాహించేందుకుగాను ఇలా చేశాను" అని చెప్పారు. కాగా, బొమ్మనహళ్లికి చెందిన ఓ సేల్స్‌మెన్‌ చాంద్‌ మహ్మద్‌ అభినందన్‌కు వీరాభిమాగా మారాడు. దాంతో ఆయన లాగా మీసాలను సెట్‌ చేయించుకున్నాడు. దీనిపై ఆయన స్పందిస్తూ, "అభినందన్‌ రియల్‌ హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయనలాగా నా మీసాలు సెట్‌ చేయించుకున్నాను" అని తెలిపారు.