తెరపైకి రానున్న అభినందన్ బయోపిక్...?

SMTV Desk 2019-03-05 12:55:05  Abhinandan, Sanjay Lela Bhansal, Biopic, Abhishek Kapoor , John Abraham

ముంబై, మార్చి 05: సినీ పరిశ్రమలో ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలలోని ప్రముఖుల జీవిత కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ కి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రమాదవశాత్తు పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కి, అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించి దేశ రక్షణ రహస్యాలను కాపాడిన ధీరుడు ఈ భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటుంది. అతడిపై భారతీయుల్లో అత్మీయాభిమానం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో, అభినందన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్ సంజయ్ లీల భన్సాల్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ బయోపిక్ కి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే అభినందన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారన్న దానిపై విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి బాలీవుడ్ హంక్ జాన్ అబ్రహాం అభినందన్ పాత్రపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. అభినందన్ లాంటి రియల్ హీరో పాత్రను చేయమని ఎవరైనా అడిగితే నిస్సందేహంగా చేస్తానని స్పష్టం చేశాడు జాన్ అబ్రహాం.