నేడే ప్రారంభం కానున్న ఎలక్ట్రిక్ బస్సులు

SMTV Desk 2019-03-05 12:41:07  Electric Busses, Miyapur, Cantonment, Non Polluting

హైదరాబాద్, మార్చి 5: ఎన్నో రోజులుగా మాట్లాడుకుంటున్న ఎలక్ట్రిక్ బస్సులు మన ముందుకు రాబోతున్నాయి. వాతావరణాన్ని కాలుష్యం చెయ్యని ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని మంగళవారం ప్రారంభిస్తున్నారు. మొదటగా 40 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని టీఎస్‌ ఆర్టీసీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఇప్పటికే ట్రయల్‌రన్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. మంగళవారం సాయంత్రం ఈ బస్సులు మియాపూర్‌-2 డిపో నుండి బయలుదేరనున్నాయి. టీఎస్‌ ఆర్టీసీ ఎండీతోపాటు బస్సుల్ని తయారుచేసిన ప్రైవేటు సంస్థ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మియాపూర్‌-2 డిపో నుండి 20, కంటోన్మెంట్‌ డిపో నుండి 20 బస్సులు మొదలు కానున్నాయి.

ఈ బసులు ముఖ్యంగా శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ రూట్లలో నడపనున్నారు. ఏసీ బస్సు ఛార్జీలనే ఎలక్ర్టికల్‌ బస్సుల్లోనూ వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. తరువాత ప్రయాణికుల నుండి వచ్చే రెస్పాన్సు ను బట్టి భవిష్యత్తులో మిగతా రూట్లలోనూ ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపే అవకాశాల్ని పరిశీలిస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. మియాపూర్‌-2, కంటోన్మెంట్‌ డిపోలలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ఛార్జింగ్‌ స్టేషన్‌లో 10-12 బస్సులకు ఒకేసారి ఛార్జింగ్‌ పెట్టే సౌకర్యం ఉంటుంది. ఒక్కో బస్సు 4 గంటలు ఛార్జింగ్‌ చేస్తే 300కీ. మీ.లు వెళ్తుందని అధికారులు తెలిపారు.